శ్రీ చిమ్మని మనోహర్





July-2013





Interview with Sri Chimmani Manohar                  Visit: www.nagnachitram.blogspot.com


1.మీ గురించిన వివరాలు, బ్లాగు ప్రపంచం లోనికి రావడానికి గల కారణాలు చెబుతారా..?

నా గురించిన వివరాలంటూ ప్రత్యేకంగా చెప్పుకోడానికి, నా దృష్టిలో, అంతగా ఏమీ లేవు. ఒకటి రెండు చిన్న చిన్న విషయాలు మాత్రం మీతో పంచుకోడానికి ప్రయత్నిస్తాను.

నేను పుట్టిన ఊరు వరంగల్. గత రెండున్నర దశాబ్దాలుగా నేను ఉంటున్నది మాత్రం హైద్రాబాద్ లోనే. 

మెషినిస్టుగా ఫాక్టరీల్లో పనిచేసిన తర్వాత, అది నా జీవితం కాదనుకొని మళ్లీ చదువు వైపు వెళ్లాను. తెలుగు సాహిత్యం, లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్సుల్లో ఉస్మానియా యున్నివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివాను. యూనివర్సిటీ టాపర్‌గా పీజీలో రెండు గోల్డ్ మెడల్స్ కూడా పొందాను.
మూడు సెంట్రల్ గవర్నమెంటు సంస్థల్లో పనిచేశాను. నా ఆఖరి ఉద్యోగం - ఆలిండియా రేడియోలో సుమారు 11 ఏళ్లు పనిచేశాక, ఆ ఉద్యోగానికి రిజైన్ చేశాను. ప్రస్తుతం నాకెంతో ఇష్టమయిన "ఇన్‌ఫొప్రెన్యూర్" (ఇన్‌ఫర్మేషన్ మార్కెటింగ్ ఆన్‌లైన్) పనిని స్వంతంగా పూర్తిస్థాయిలో చేస్తున్నాను.

రచనలు, సినిమాలు నాకిష్టమైన ఇతర వ్యాపకాలు. నా గురించిన ఇతర అన్ని వివరాలు నా ఫేస్‌బుక్ పేజ్ లో ఉన్నాయి.


ఇక నేనీ బ్లాగ్ ప్రపంచంలోకి రావడానికి కారణాలు .. 

నిజానికి ఈ బ్లాగ్ ప్రపంచంలోకి నేను ఎప్పుడో రావాల్సింది. తెలుగు టైపింగ్ అంటేనే నాకున్న భయం వల్ల ఆ పని చేయలేకపోయాను. అనుకోకుండా ఒక రోజు నాలో ఆ భయం పోయింది. థాంక్స్ టూ, లేఖిని! ఆ తర్వాత, నా ఫ్రెండ్ కామేష్‌కు. వాడి కోసం ఒక తెలుగు బ్లాగ్‌ని క్రియేట్ చేస్తూ, అనుకోకుండా "యూనికోడ్" గురించి, లేఖిని మొదలైన వాటిగురించి తెలుసుకున్నాను. ఆ రోజే నా తొలి తెలుగు బ్లాగ్ "నగ్నచిత్రం" ఊపిరిపోసుకుంది. (నా బ్లాగులో నేను రాసిన "భయంలేని బ్లాగింగ్" చదివితే మీకు విషయం పూర్తిగా తెలుస్తుంది.)


దీనికంటే ముందు చెప్పాల్సిన కారణం ఇప్పుడు చెప్తున్నాను. నాకు చిన్నప్పటినుంచీ చదవటం, రాయటం అలవాటు. నేను స్టూడెంట్‌గా ఉన్నప్పట్నుంచే నా కథానికలు, వ్యాసాలు, ఫీచర్లు మొదలైనవి ఎన్నో దాదాపు అన్ని తెలుగు న్యూస్‌పేపర్లు, మేగజైన్లలో ప్రచురితమయ్యాయి. ఎక్కువగా నేను రాసిన కథానికలు "ఆంధ్ర భూమి" వీక్లీలో అచ్చయ్యాయి.  

నాకు రష్యన్ భాష కూడా వచ్చు. రష్యన్ నుంచి నేరుగా తెలుగులోకి ఒక ఇరవై వరకు కథల్ని అనువదించాను. వాటిలో ఎక్కువభాగం కథలు "విపుల", "ఆంధ్ర జ్యోతి" పత్రికల్లో అచ్చయ్యాయి. వాటిల్లో ఇప్పటికీ, ఎప్పటికీ నేను మరువలేని కథానిక - కాన్‌స్టంటైన్ పవుస్తోవ్స్‌కి రాసిన "స్నేగ్" (మంచు).    


ఏ రచయితైనా, తన జీవన పర్యంతం రాయటం అనే తన ప్యాషన్ ను మర్చిపోలేడు. ఇదే ఇతర సృజనాత్మక రంగాల్లోని వారికందరికి కూడా వర్తిస్తుంది. నా విషయంలోనూ అంతే. పైగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకు అందించిన ఒక అందమైన బహుమతి ఈ బ్లాగ్. ఈ బహుమతిని నేను మనస్పూర్తిగా స్వీకరించాను. ఇదివరకటిలా కాగితం మీద రాసి, పోస్ట్ చేసి, దాని ప్రచురణ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. మనం ఏదంటే అది రాసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు రాసుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే. 

ఒక్క బ్లాగ్‌ ఉంటే చాలు. రచయిత ఏదయినా రాయవచ్చు. ఎన్ని ప్రయోగాలయినా చేసుకోవచ్చు. ఎంతయినా సాధించవచ్చు. ప్రస్తుతం నా ఆలోచనలు ఆ దిశలో సాగుతున్నాయి.

***     

2.బ్లాగరుగా మీకు కలిగిన అనుభవాలు చెప్పగలరా?
2012 ఆగస్టులో నేను క్రియేట్ చేసిన ఈ బ్లాగ్‌ని, గత డిసెంబర్ నుంచే కొంచెం సీరియస్‌గా తీసుకున్నాను. "రాయడం" అన్న నాకత్యంత ప్రియమైన హాబీని, మళ్లీ ఈ బ్లాగ్ ద్వారా మొదలెట్టి, బాగా ఎంజాయ్ చేస్తున్నాను. 

'అందరూ నా బ్లాగ్ విజిట్ చేయాలి, చదవాలి' అన్నది నా ప్రధాన ఉద్దేశ్యం కాదు. నేను రాయాలనుకున్నది రాయాలి. నన్ను నేను పలకరించుకోవాలి. ఆవిష్కరించుకోవాలి. విశ్లేషించుకోవాలి. అది కూడా ఎలాంటి భేషజాలు, సందిగ్ధాలూ లేకుండా. అనవసరపు "మాస్క్"లు వేసుకోకుండా. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ అనుభవం నాకు ఈ నగ్నచిత్రం వల్లనే సాధ్యమైంది. 

ఒక విధంగా - ఈ నగ్నచిత్రం, నా ఫేస్‌బుక్ పేజ్.. ఈ రెండూ నా బెస్ట్ ఫ్రెండ్స్!   

ఇంకా - ఈ బ్లాగ్ ద్వారా చాలా దేశాల్లోని తెలుగువారితో కొత్త కొత్త పరిచయాలయ్యాయి. వారందరి మెయిల్స్, కామెంట్స్ చదవటం, కొత్త కోణాల్ని తెలుసుకోవడం ఒక మంచి అనుభూతి. 

గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు, నగ్నచిత్రం మీద 45,000 లకు పైగా
 పేజ్ వ్యూస్ రిజిస్టర్ అయ్యాయి. ఇది కూడా నేను ఊహించనిది. ఒకటి రెండు నెలల్లోనే ఈ అంకెను 100,000 కు చేర్చాలన్నది నా కోరిక.  

***

3.మీకు నచ్చిన బ్లాగులు గురించి వివరించగలరా ..?
ప్రముఖ రచయిత పావ్లో కోయెల్యూ బ్లాగ్ నాకు బాగా నచ్చిన బ్లాగు. "ది ఆల్కెమిస్ట్" వంటి అద్భుతమైన పుస్తకాలు రచించి, ఇప్పటివరకు సుమారు 150 దేశాల్లో 100 మిలియన్ల పుస్తకాల్ని అమ్మిన ఈ బ్రెజిల్ రచయిత బ్లాగ్‌ని నేను ఎక్కువగా ఇష్టపడతాను. అలాగే, నిర్భయంగా తను అనుకున్నది రాసే ప్రముఖ రచయిత్రి శోభా డే బ్లాగ్ కూడా నేను తరచూ విజిట్ చేస్తాను.  

తెలుగు బ్లాగుల విషయంలో మాత్రం నేను ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే చదువుతున్నాను. ఈ విషయంలో "పూదండ" పాఠకుల సజెషన్స్‌ని ఆహ్వానిస్తున్నాను. ముందుగానే వారికి నా కృతజ్ఞతలు.

***

4. మీ జీవితంలో మరచిపోలేని సంఘటనలు ఏమైనా వుంటే వివరించగలరా..?

చాలా ఉన్నాయి. ఒక్క నాకే కాదు. ప్రతి మనిషి జీవితంలోనూ మర్చిపోలేని సంఘటనలు అనేకం ఉంటాయి. అయితే, వాటిల్లో చాలా వాటిని గురించి మనం బాహాటంగా చెప్పుకోవటం వివిధ కాణాల వల్ల కుదరదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. 

నగ్నచిత్రంలో ఎలాంటి భేషజాలకు పోకుండా, ఎలాంటి మాస్కులు వేసుకోకుండా, కేవలం నిజాలే రాస్తున్నాను. అలా రాయాలనే ఈ బ్లాగ్‌కు నేనీ పేరు పెట్టాను. అలా రాయలేని టాపిక్ ఏదయినా ఉంటే అసలు దాని గురించి కనీసం ప్రస్తావించకుండా మౌనంగానే ఉంటాను. 

పూదండ పాఠకుల కోసం కొన్ని నేను మర్చిపోలేని పాజిటివ్ సంఘటనలు మాత్రం పంచుకుంటాను:

> ఆంధ్రభూమి వీక్లీ లో బహుమతిపొందిన నా కథానిక ఒకటి చదివి, చెన్నై నుంచి ఒక డైరెక్టర్ నన్ను కథాచర్చలకి ఆహ్వానించడం.

> ఆ ప్రారంభం, ఆ తర్వాత, నేను ఎన్నో సినిమాల కథా చర్చలకి వెళ్లడానికి కారణమయింది. మంచి పారితొషికాలు కూడా లభించాయి ఎప్పటికప్పుడు. 

> ఈ అనుభవంతో - స్క్రిప్ట్ రైటింగ్ పైన నేను రాసిన "సినిమా స్క్రిప్టు రచనాశిల్పం" పుస్తకానికి నంది అవార్డు రావటం. ఆ పుస్తకమే ఆ తర్వాత నేను ఒక దర్శకుడిని కావడానికి కారణం అవడం.  

> నేను గోవాలో ప్రతి ఏటా 
జరిగే 'ఇఫ్ఫి' (IFFI) కి వెళతాను. సుమారు 8 ఏళ్ల క్రితం అనుకుంటాను. అలా ఇఫ్ఫి కి వెళ్లినప్పుడు, ఒకరోజు బయట ఒక టేబుల్ దగ్గర ఏదో సాఫ్ట్ డ్రింక్ తీసుకుని, మణిరత్నం గారు ఒక్కరే  కూర్చుని ఉన్నారు.  నేను వెళ్లి ఆయన్ను విష్ చేశాను. కూర్చోమన్నారు. కనీసం ఒక పావుగంట ఆ రోజు ఆయనతో మాట్లాడాను. ఆయనెందుకు ఆ స్థాయి డైరెక్టర్ కాగలిగాడో ఆ కొద్దిసేపటి మా సంభాషణలోనే నాకర్థమయింది. 

> ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది తన దర్శనం కోసం వెయిట్ చేస్తుండగా - "ఆర్ట్ ఆఫ్ లివింగ్" వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురు, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు తమ బెంగళూరు ఆశ్రమంలో నాకు ప్రథమ దర్శనం ఇవ్వటం. వారి ఎదురుగా కూర్చుని కనీసం ఒక అరగంట పాటు మాట్లాడుతూ గడపటం. నన్నే ఆ రోజు ఎందుకని ముందు లోపలికి పిలిచారో ఇప్పటికీ నాకు అర్థం కాని నిజం.

నా జీవితంలో నేను మర్చిపోలేని పాజిటివ్ సంఘటనలు ఇలా ఎన్నయినా చెప్పగలను. ఎన్నో బ్లాగ్ పోస్టులు రాయగలను. 



యాక్సిడెంటల్‌గా నేను ప్రవేశించిన సినిమా ఫీల్డు నేపథ్యంగా, ఆ ఫీల్డులో నేను ప్రవేశించిన కారణంగా.. నా జీవితంలో కొన్ని అత్యంత దారుణమయిన నెగెటివ్ అనుభవాల్ని కూడా నేను ఎదుర్కొన్నాను. వాటి గురించి రాయటం ప్రస్తుతం నాకు ఇష్టం లేదు. అయితే, త్వరలోనే వాటి గురించి లైటర్‌వీన్లో సరదాగా ఒక పుస్తకం మాత్రం రాస్తాను. 



అసలు సినిమా ఫీల్డులోకి ఎందుకు వెళ్లకూడదు, ఎందుకు వెళ్లితీరాలి అన్నది నేను రాయాలనుకుంటున్న ఆ పుస్తకం ప్రధానాంశం అవుతుంది. ఇది కొత్తగా ఫీల్డులోకి ప్రవేశించేవారికి ఉపయోగపడాలన్నదే నా ఉద్దేశ్యం తప్ప వ్యక్తులను గురించి రాయటం కాదు. నేను చదివిన "రాడికల్ ఫర్‌గివ్‌నెస్" అన్న పుస్తకం ఈ విషయంలో నా ఆలోచనా విధానాన్ని సంపూర్ణంగా మార్చివేసింది.  



ఇక - 2012 జనవరి 4వ తేదీ నాడు అర్థరాత్రి, బంజారా హిల్స్ లోని "పిజ్జా కార్నర్" ఎదురుగా నాకు జరిగిన పెద్ద యాక్సిడెంట్ కూడా నేను మర్చిపోలేని ఒక సంఘటన.       


***

5. ఇంకా మీ హాబీలు ఏమైనా వున్నాయా..?

పుస్తకాలు, సినిమాలు, పర్సనల్ డెవలప్‌మెంట్, స్పిరిచువాలిటీ.. ఇవే నాకు అత్యంత ప్రియమైన హాబీలు, ఇష్టాలు. ఆర్ట్ (పెయింటింగ్) కూడా నాకెంతో ఇష్టమయిన మరొక హాబీ. 2014 చివరినాటికి, నా మొట్టమొదటి ప్రొఫెషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ని నిర్వహించాలన్నది నా ఆలోచన.

***

6.తెలుగు బ్లాగరులకి ఏమైనా సూచలు ఇస్తారా..?
అమెరికాతో సహా - యాంత్రికమయిన జీవితం గడుపుతున్న ఎన్నో అభివృధ్ధి చెందిన దేశాల్లో కూడా - ఇప్పటికీ పుస్తకాలు చదవటమే ప్రధాన హాబీగా కొనసాగుతోంది. దాదాపు అత్యధిక శాతం అంతర్జాతీయ స్థాయి "బెస్ట్ సెల్లర్స్" పుస్తకాలని ఆయా దేశాల రచయితలే రాస్తున్నారు. మనం మాత్రం చదవటం, రాయటం పూర్తిగా మర్చిపోతున్నాం. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి బ్లాగింగ్ చాలా ఉపయోగపడుతుంది. 

జీవితమంటే కేవలం ఇడియట్ బాక్స్‌లు, బెట్టింగ్ క్రికెట్లే కాదు. పుస్తకాలు, ఇతర కళలు కూడా అన్నది మన బ్లాగింగ్ ద్వారా తెలియజేద్దాం. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా - మనిషి అత్యున్నత స్థాయికి ఎదగడానికి తోడ్పడే ఆలోచనలకు కారణమయిన "చదివే అలవాటు"ని మళ్లీ వెలుగులోకి తీసుకువద్దాం. ఇది నా సూచన కాదు. నివేదన. 

My contact: mchimmani@gmail.com
Follow me on FB: facebook.com/onemano
Follow me on Twitter: @MChimmani


                                                                                    --K V V S Murthy