శ్రీ నరిశెట్టి ఇన్నయ్య

AUGUST-2013


నరిశెట్టి ఇన్నయ్య గారితో ఇంటర్వ్యూ లోని విశేషాలు

Visit  his blog here: www.innaiahn.blogspot.com 



నేను మానవవాదిని. వైజ్ఞానిక దృక్పథంతో జీవితంలో అన్వేషణ కొనసాగించడం, ఎప్పటికప్పుడు జరుగుతున్న శాస్త్రీయ పరిశోధనలను వాటి ఫలితాలను తెలుసుకొని పదిమందికీ చెప్పగలగటం ప్రధాన ఆశయంగా పెట్టుకున్నాను. ఈ శాస్త్రీయ పద్ధతికి అంతం లేదు. ఒకసారి కనుగొన్న విషయం మార్పులకు చేర్పులకు గురి కావటం కూడా ఇందులో భాగమే. ఈ శాస్త్రీయ ధోరణి మానవులకు ఉపయోగపడుతున్నది. ఇందులో కుల మతాలకు, ప్రాంతీయ భేదాలకు ఆస్కారం లేదు. ప్రపంచంలో ఎక్కడ ఎవరు కనుగొన్నా అది రుజువైన తరువాత విశ్వవ్యాప్తమవుతుంది. ఈ సుగుణం మానవులను ముందుకు తీసుకెళుతున్నది. ఈ పద్ధతి నాకు బాగా నచ్చింది. జీవితంలో వీటిని పాటిస్తున్నప్పుడు అనేక సమస్యలు ఎదురయ్యాయి. సమాజంలో పాతుకుపోయిన కులాలు, మతాలు, గుడ్డినమ్మకాలు పోగొట్టుకోవటం అంత తేలిక కాదనిపించింది. అందువలన అధ్యయన శిబిరాలు పెట్టటం కొత్త విషయాలు వివరించటం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం. అందువలన జ్యోతిష్యం, వాస్తు, హోమియోపతి వంటి అనేక అశాస్త్రీయ విషయాలు నమ్మేవారితో సమస్యలు ఎదురయ్యాయి. 

నేను హైస్కూలులో చదువుతున్న రోజులలో స్వాతంత్రోద్యమం ముమ్మరంగా సాగటం, ఆంధ్ర ప్రాంతం కోసం ఆందోళన జరగటం మదరాసు నుండి విడిపోయి, ఆంధ్ర ఏర్పడటం, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రావడం నా అనుభవంలోకి వచ్చిన విశేషాలు. నేను సూర్యదేవర నరసయ్య హైస్కూలులో (చేబ్రోలు, గుంటూరుజిల్లా) చదువుకున్నాను. అప్పట్లో తెలుగు మీడియం ఉండగా, కాలేజీకి వచ్చేసరికి ఇంగ్లీషుమీడియంలోకి మారినప్పుడు కొంత గడ్డు పరిస్థితి ఏర్పడింది. అది అధిగమించి దారినపడటానికి సమయం పట్టింది. నేను గుంటూరు ఎ.సి. కాలేజీలో ఫిలాసఫీతో గ్రాడ్యుయేట్ అయ్యాను. ఆరోజులలో నాకు అధ్యాపకులుగా కరుణశ్రీ జంథ్యాల పాపయ్య శాస్త్రి, జమ్మలమడక మాధవరాయశర్మ, తెలిచర్ల వెంకటరత్నం, స్ఫూర్తిశ్రీ భాస్కరరావు, మారేమండ నాగేశ్వరరావు మొదలైనవారు ఉండేవారు. తెలుగు సాహిత్యంలో అభిరుచి పెరగటానికి వారెంతో దోహదం చేశారు. కానీ కాలేజీ స్థాయిలో నాకు ఇంగ్లీషు లెక్చరర్ గా ఉన్న ఎలవర్తి రోశయ్య చెప్పిన పాఠాలు కాలేజీ వెలుపల ఆయనతో సన్నిహిత పరిచయం నన్ను శాస్త్రీయ పరిశీలనవైపుకు, మానవవాదానికి పుట్టింది. 

కాలేజీ రోజులలోనే నేను జర్నలిస్టుగా ఉద్యోగం చేశాను. తొలుత గుంటూరు నుండి వెలువడిన ప్రజావాణి వారపత్రికలో వట్టికొండ రంగయ్య సంపాదకత్వాన పనిచేశాను. అదొక శిక్షణా కేంద్రం వలె పనిచేసింది. ఆరోజులలోనే మా తండ్రి రాజయ్య అన్న విజయరాజకుమార్ ఆచార్య రంగా రాజకీయాలలో వుండేవారు. నేను ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు, పనిచేయలేదు. కానీ అన్ని రాజకీయ పార్టీలను పరిశీలిస్తూ రచనలు చేశాను. గ్రాడ్యుయేషన్ అయిన తరువాత రెండేళ్ళపాటు ఆచార్య ఎం.జి. రంగా కోరికపై ఆయనకు పర్సనల్ సెక్రటరీగా పనిచేశాను. అందువలన చాలమందితో పరిచయం చాలా విషయాలు అనుభవం కలిగింది. 

ఆంధ్రాయూనివర్సిటీలో ఫిలాసఫీ ఎం.ఎ. చేస్తున్నప్పుడు నాకు టీచరుగా కొత్త సచ్చిదానంద మూర్తి వుండటం నాకు ఎంతో మేలు కలిగింది. ఆ తరువాత ఆయనతో జీవితమంతా సన్నిహితంగా వుండగలిగాను. 

నేను తొలి వుద్యోగం మెదక్ జిల్లా సంగారెడ్డిలో హైస్కూలు టీచరుగా ట్రెయినింగు లేని గ్యాడ్యుయేట్ గా పనిచేశాను (1960-64). అప్పుడే తెలంగాణా అంతటా పర్యటించటం పరిచయాలేర్పడటం మరోకోణం. 

జీవితంలో మలుపు

నేను మానవవాదిగా పరిణమించటానికి తెనాలిలో ఆవుల గోపాలకృష్ణమూర్తితో పరిచయం తోడ్పడింది. ఆయన ఉత్తరోత్తర నా వివాహానికి ఆధ్వర్యం వహించి కార్యక్రమం జరిపించారు (1964). ఆ సమావేశానికి ఆవుల సాంబశివరావు అధ్యక్షత వహించారు. మూల్పూరు గ్రామానికి చెందిన వెనిగళ్ళ కోమలను వివాహం చేసుకున్నాను. నాకు నవీన, రాజు సంతానం. 

1964 నుండి నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి చేసి కొద్దిరోజులు ఫిలాసఫీ లెక్చరర్ గా పనిచేశాను. కానీ, నిరంతరం రాడికల్ హ్యూమనిస్ట్, రేషనలిస్ట్ కార్యక్రమాలలో పాల్గొంటూ అఖిలభారత స్థాయిలో పరిచయాలేర్పరచుకున్నాను. వి.ఎమ్.తార్కుండే, శిబ్ నారాయణ్ రేలతో పరిచయం ఏర్పడింది. సెక్యులరిస్ట్ నాయకుడు ఎ.బి.షా.తో సన్నిహిత పరిచయం వలన శాస్త్రీయ పద్ధతి అంటే ఏమిటో గ్రహించగలిగాను. ఆయన రాసిన సైంటిఫిక్ మెథడ్ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాను. ఎమ్.ఎన్.రాయ్ అనుసరించిన మానవవాదం, అందులోని శాస్త్రీయ పద్ధతి నన్ను ఆకట్టుకున్నాయి. ఆయన ప్రధాన రచనలు తెలుగులోకి అనువదించగా తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ ప్రచురించాయి. 

అంతర్జాతీయ స్థాయిలో మానవవాద, హేతువాద ఉద్యమాలతో వాటిల్లో పనిచేసే వారితో సన్నిహిత సంబంధాలేర్పడ్డాయి. 

పత్రికా రచనలలో రేడియోలో టి.వి. కార్యక్రమాలలో శాస్త్రీయ పద్ధతిపై జరిగిన చర్చలలో ఎంతోమంది నమ్మకస్తులతో వాదోపవాదాలు జరిగాయి. బాబాలను, మాతలను వారి అక్రమాలను ఆధ్యాత్మికత పేరుతో వారు ప్రజలను మోసగించిన తీరును ఎండగట్టినప్పుడు చాలా తీవ్రంగా ప్రతిఘటన వచ్చింది. అలాగే మేజిక్ ద్వారా అంధ విశ్వాసాలను బయటపెట్టించినపుడు చాలామంది సమాధానం చెప్పలేక ఆగ్రహం వెలిబుచ్చారు. హోమియోపతిని శాస్త్రీయం అని రుజువు చెయ్యమని సవాలు చేసినప్పుడు దాడి చేసారేగాని జవాబు చెప్పలేకపోయారు. వివేకానంద వంటివారిని విమర్శించినపుడు ఆవేశాన్ని, ఆగ్రహాన్ని చూపారేగాని జవాబు చెప్పలేకపోయారు. ముస్లిముల అమానుష మత ఛాందసాన్ని క్రైస్తవుల దారుణ మత విషయాలను ఎండగట్టినప్పుడు కూడా ఇలాంటి ఆగ్రహమే వెలువడింది. కానీ, నేను రాజీపడలేదు. నేను చెప్పినవి  ఒప్పుకొని ఎవరూ చూపలేదు. 

1992 నుండి నా సంతానం దృష్ట్యా అమెరికాకు  రాకపోకలు సాగించాను. దానివలన అంతర్జాతీయ మానవవాద నాయకులను కలుసుకోటానికి వారి సభలలో పాల్గొని ప్రసంగించటానికి సదవకాశం కలిగింది. సుప్రసిద్ధ సైంటిస్టు, పరిణామ వాది రిచర్డ్ డాకిన్స్ తో పరిచయం ఏర్పడటమే గాక ఆయన రచన తెలుగులోకి ‘దేవుడి భ్రమలో’ అనే శీర్షికన అనువదించాను. కీర్తీ శేషులు క్రిస్టఫర్ హిచిన్స్ తో పరిచయం ఏర్పడింది. సుప్రసిద్ధ సైంటిస్టు కీ.శే. కార్లశాగన్ తో పరిచయం ఏర్పడింది. మానవాద నాయకుడు పాల్ కర్జ్ నన్నెంతో ప్రోత్సహించారు. నా రచన ‘ఫోర్స్ డ్ ఇన్ టు ఫెయిత్’ అమెరికాలో ప్రచురించారు. యూరోప్ లో కూడా పర్యటించి కొందరు అంతర్జాతీయ మానవవాద నాయకులను కలుసుకుని చర్చలు జరపగలిగాను. ఈ విధమైన కృషితో యథాశక్తి మానవవాద ఉద్యమంలో పనిచేస్తున్నాను. ఎప్పటికప్పుడు శాస్త్రీయ రంగంలో వస్తున్న కొత్త విశేషాలను తెలుసుకొని వీలైనంతవరకు ఇతరులకు చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను. 

బ్లాగులు

నేను తొలుత ప్రారంభించి బ్లాగు ‘నాప్రపంచం’ దీనికి నా మిత్రుడు సి.భాస్కరరావు బాగా తోడ్పడ్డారు. సాంకేతికపరమైన విషయాలు ఆయనే నాకు ఎప్పటికప్పుడు చెపుతున్నారు. నా ప్రపంచం బ్లాగు బాగా ప్రచారంలోకి వచ్చింది. దాని తరువాత ప్రస్తుతం మానవవాదం పేరిట బ్లాగు నిర్వహిస్తున్నాను. ఇంగ్లీషులో సైంటిఫిక్ హ్యూమనిజం అనే బ్లాగు నిర్వహిస్తున్నాను. అది ఆవుల గోపాలకృష్ణమూర్తి, నార్ల వెంకటేశ్వరరావు రచనలు, సమాచారం అందించటానికి బ్లాగులు పెట్టాము. నేను ఇతరుల బ్లాగుల్లోనూ ముఖ్యంగా దీప్తిధార, పారదర్శి, కౌముది, సారంగలలో కూడా రాస్తున్నాను. 

బ్లాగులు నేటి ఆధునిక ప్రచార, ప్రసార భావవ్యాప్తి కేంద్రాలుగా తయారయ్యాయి. వీటిలో వక్తిగతమైనవి ఎక్కవగా వుంటున్నాయి. అనేక ప్రతిభావంతులైన స్త్రీలు తమ రచనలు అందించటానికి బ్లాగులు పెట్టారు. చాలామందిని కదిలించటానికి రచనలు ప్రోత్సహించటానికి బ్లాగులు తోడ్పడుతున్నాయి. కంప్యూటర్, సెల్ ఫోన్ వలె బ్లాగు కూడా నిత్యావసరాల్లోకి వచ్చేసింది. 

బ్లాగులలో వచ్చే విషయాలపై చర్చ జరుగుతున్నప్పుడు వ్యక్తిగత నిందలకి పోవటం కనిపిస్తున్నది. విషయాన్ని శాస్త్రీయ పద్ధతిలో చర్చించలేనప్పుడు తమకు నచ్చని విషయాలు వచ్చినప్పుడు కొందరు దూషణలకు దిగుతున్నారు. ఇది వక్రమార్గంగా అనిపిస్తున్నది. ఒక పద్ధతిలో చర్చ జిరిగితే బాగుంటుంది. 

నాకు నచ్చిన బ్లాగులు

సంజీవదేవ్ పై సి. భాస్కరరావు ఏర్పరచిన బ్లాగు నాకు బాగా నచ్చింది. కానీ శాస్త్రీయ పరిశీలన ముఖ్యంగా సైన్సు, సాంకేతిక విషయాలు సరళంగా అందించే తెలుగు బ్లాగులు అనల్పంగా  వున్నాయి. ఇంగ్లీషులో నాకు నచ్చిన బ్లాగులు ముఖ్యంగా సైన్సు, సాంకేతికం వైద్యం, విమర్శనా రంగంలో చాలా వున్నాయి. అందులో రిచర్డ్ డాకిన్స్ నిర్వహిస్తున్న బ్లాగు, జేమ్స్ రాండీ ఫౌండేషన్ వారి బ్లాగు శ్యామ్ హేరిస్, తస్లీమా నస్రీన్, అయన్ హర్షీ అలీ బ్లాగు నమూనాగా స్వీకరించదగినవిగా వున్నాయి. అలాంటివి తెలుగులోనూ విస్తృతంగా రావాలని నా కోరిక. కంప్యూటర్ల గురించి సులభంగా చెప్పడానికి వేమూరి వెంకటేశ్వరరావు వంటివారు చేస్తున్న కృషి అనుసరణీయం. కనుక మనకు తెలుగ కథలలో పేర్కొనదగినన్ని బ్లాగులు వచ్చాయి. విద్యార్థులలో వీటి స్వభావం కనిపిస్తున్నది. 

తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ నా రచనలు కొన్ని వున్నాయి. ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువాదాలు కూడా కొన్ని వెలువడ్డాయి. అందువలన అనువాద ప్రక్రియలో కొన్ని అనుభవాలు సంతరించాయి. సాంకేతికపరమైన విషయాలు సులభంగా అర్థం అయ్యేటట్లు రాయడంలో కష్టాలు ఎదుర్కొన్నాను. 


                                                                                     --K V V S Murthy